TELUGU MURLI 19-03-2023

 

19-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి‘ ‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 25-1-94 మధువనం

‘‘బ్రాహ్మణుల స్వభావము విశేషతతో కూడిన స్వభావము – దీనిని సహజమైన స్మృతి స్వరూపముగా తయారుచేసుకోండి’’

ఈ రోజు బాప్ దాదా తమ సర్వ విశ్వం యొక్క విశేష ఆత్మలను చూస్తున్నారు. డ్రామానుసారంగా ఆత్మలైన మీది ఎంతటి విశేష పాత్ర రచించబడి ఉంది. ఈ రోజు బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి విశేషతలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిని చూసి ‘వాహ్ పిల్లలు’ అన్న స్నేహపు గీతము హృదయంలో మోగుతోంది. దానితో పాటు ఇది కూడా చూస్తున్నారు, పిల్లల ప్రతి ఒక్కరి హృదయం నుండి ‘వాహ్-వాహ్’ అన్న గీతము సదా వెలువడుతోందా? ప్రతి కర్మలోను, ప్రతి అడుగులోను, ప్రతి సంకల్పములోను ఈ శ్రేష్ఠ అనుభవము కలుగుతోందా లేక అప్పుడప్పుడు కలుగుతోందా? సాధారణ జీవితం నుండి వేరుగా ఈ విశేష జీవితము సదా స్వతహాగా ఉంటుందా? లేక స్మృతి తెచ్చుకున్నప్పుడే అనుభవమవుతుందా? ఎప్పుడైతే జీవితము ఉందో, జీవితము యొక్క అర్థమే – సదా మరియు స్వతహాగా ఉండేది. స్మృతిలోకి తెచ్చుకున్నప్పుడు అనుభవం చేసుకోవడము మరియు స్మృతిలోకి తెచ్చుకోనప్పుడు విశేషతకు బదులుగా సాధారణ జీవితము అనుభవమవ్వడము – ఇది విశేష ఆత్మలైన మీ యొక్క విశేషత కాదు. బ్రాహ్మణ జన్మయే విశేష జన్మ. ఎవరి జన్మ అయితే విశేషముగా ఉంటుందో వారి జీవితము ఎలా ఉంటుంది? విశేషముగా ఉంటుందా లేక సాధారణంగా ఉంటుందా? బ్రాహ్మణ జన్మ కూడా శ్రేష్ఠమైనది, బ్రాహ్మణ ధర్మము కూడా శ్రేష్ఠమైనది మరియు బ్రాహ్మణ కర్మ కూడా శ్రేష్ఠమైనది ఎందుకంటే బ్రాహ్మణ జన్మ దాత, బ్రాహ్మణ ధర్మ స్థాపకులు, సర్వశ్రేష్ఠులైన పరమ ఆత్మ మరియు ఆది ఆత్మ అయిన బ్రహ్మా తండ్రి. ఏ విధంగా రచయిత సర్వశ్రేష్ఠమైనవారో, అలాగే రచన కూడా సర్వశ్రేష్ఠమైనది అనగా విశేషమైనది. బ్రాహ్మణుల కర్మ ఎందుకు విశేషమైనది? ఎందుకంటే కర్మలో అనుసరించేందుకు మీ అందరి ముందు ఆది ఆత్మ అయిన బ్రహ్మా తండ్రి శ్యాంపుల్ రూపంలో ఉన్నారు. కర్మలో సాకార బ్రహ్మా తండ్రిని అనుసరిస్తారు, అందుకే భాగ్యవిధాత అనగా కర్మ ద్వారా భాగ్య రేఖను శ్రేష్ఠముగా తయారుచేసేవారు బ్రహ్మా అని అంటూ ఉంటారు. భాగ్యం యొక్క రేఖకు కలము కర్మలు. కావున శ్రేష్ఠ కర్మకు సహజమైన చిహ్నము బ్రహ్మా తండ్రి, అందుకే మీరందరూ విశేష పురుషార్థము అనే పదాన్ని ఈ విధంగానే వర్ణిస్తారు – తండ్రి సమానంగా అవ్వాలి.

ఈ అవ్యక్త సంవత్సరంలో అందరి లక్ష్యము ఏముంది? నిరాకారీ స్థితిలో నిరాకారుడైన తండ్రి సమానంగా అశరీరి స్థితిని అనుభవం చేసుకున్నారా? సాకార కర్మలో బ్రహ్మా తండ్రి సమానంగా అయ్యే అనుభవాన్ని నంబరువారుగా చేసుకున్నారా? కావున విశేష జీవితానికి ఆధారము విశేష జన్మ, ధర్మము మరియు శ్రేష్ఠ కర్మ. ఏ విధంగా లౌకిక జీవితంలో కూడా ఒకవేళ ఏ ఆత్మ యొక్క జన్మ అయినా విశేష రాజ పరివారంలో జరిగినట్లయితే, వారు రాజకుమారులుగా లేక రాజకుమారీలుగా ఉన్నట్లయితే, ఈ విశేషత జన్మ యొక్క విశేషత అయిన కారణంగా ప్రతి సమయము సదా మరియు స్వతహాగా ఉంటుందా లేక నేను రాజకుమారిని అని పదే-పదే స్మృతిలోకి తీసుకువస్తారా? సహజంగా స్మృతి ఉంటుంది కదా. ఏమైనా పురుషార్థం చేస్తారా? తమ అభిరుచి కారణంగా కర్మ ఎంతటి సాధారణంగా ఉన్నా కానీ తమ జన్మ యొక్క విశేషతను ఏమైనా మర్చిపోతారా? అది సహజముగా మరియు స్వాభావికంగా అయిపోతుంది. కావున బ్రాహ్మణ ఆత్మలైన మీ యొక్క స్వభావం ఏమిటి? విశేషమైనవారా లేక సాధారణమైనవారా? ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు ఎప్పుడైనా సాధారణ కర్మలు చేసేస్తే బాప్ దాదా ఎదురుగా స్వయాన్ని నిర్దోషులుగా నిరూపించుకునేందుకు ఏం చెప్తారు? ఈ కర్మ చేయాలి అని నేను అనుకోలేదు కానీ ఇది నా స్వభావము, అందుకే అలా జరిగిపోయింది. వాస్తవానికి ఇలా అనడము లేక ఆలోచించడము యథార్థమైనదా? నేను ఎవరు? బ్రాహ్మణ జీవితము కలవారు కదా. మరి బ్రాహ్మణ జీవితము కల ఆత్మ, ఇది నా స్వభావము అని ఆలోచించవచ్చా? ఇలా అనడము రైటా? మరి ఆ సమయంలో ఎందుకు అలా అంటారు? ఆ సమయంలో మాట్లాడేది బ్రాహ్మణులు కాదు, మాయ మాట్లాడుతుంది. కావున ఈ సాధారణ స్వభావము లేక మాయావి స్వభావము సహజంగా పని చేసేస్తుంది కదా, అందుకే, నేను అలా కావాలనుకోలేదు, కానీ జరిగిపోయింది అని అంటారు. బ్రాహ్మణుల స్వభావం అనగా విశేషత యొక్క స్వభావం కూడా సహజంగా ఉండాలి. సహజ సిద్ధమైనది సదా ఉండగలదు. కావున విశేష జీవితం యొక్క స్మృతి స్వభావం రూపంలో సహజంగా ఉండాలా లేక అప్పుడప్పుడు మర్చిపోవడము, అప్పుడప్పుడు గుర్తుండడము, అలా ఉండాలా? సదా స్మృతి స్వరూపంలో ఉండండి. స్మృతిని తెచ్చుకునేవారిగా కాకుండా స్మృతి స్వరూపులుగా అవ్వండి, మరి బాప్ దాదా చూసారు – అవ్యక్త సంవత్సరము సమయమనుసారంగా పూర్తయిపోయింది కానీ బాప్ దాదా సమానంగా స్వయాన్ని సంపన్నంగా చేసుకున్నారా? ఈ అవ్యక్త సంవత్సరానికి విశేష లక్ష్యాన్ని పెట్టుకున్నారు – అవ్యక్తము అనగా ఫరిశ్తా స్వరూపంగా అవ్వాలి మరియు తయారుచేయాలి అని. అందరూ ఇదే లక్ష్యాన్ని పెట్టుకున్నారు కదా, మరి రిజల్టు ఏం వెలువడింది? మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నారా? ‘ఫరిశ్తా భవ’ అన్న వరదానము కూడా వరదాత నుండి లభించింది మరి వరదానము మరియు లక్ష్యము – రెండింటి స్మృతి ద్వారా ఎంతవరకు సఫలతను అనుభవం చేసుకున్నారు, ఈ స్వయము యొక్క సూక్ష్మ చెకింగ్ ను చేసుకున్నారా? లేక అవ్యక్త సంవత్సరం పూర్తయింది, యథాశక్తి ఎంత అనుభవమైతే చేసుకున్నారో అంత డ్రామానుసారంగా సరి పోతుందిలే అని అనుకుంటున్నారా? సంవత్సరం పరివర్తన అవ్వడంతోపాటు స్వ పరివర్తన యొక్క గతి ఎలా ఉంది – ఈ విధితో చెక్ చేసుకున్నారా? ఏ విధంగా సంవత్సరం సమాప్తమయ్యిందో అలా స్వయం కూడా లక్ష్యము మరియు లక్షణాలలో సంపన్నంగా అయ్యారా లేక ఈ సంవత్సరంలో ఇంకా అవుతాము అని ఇలా ఆలోచిస్తున్నారా? సమయము మరియు స్వయం యొక్క గతి సమానంగా ఉందా? వాస్తవానికి స్వయం యొక్క గతి సమయం కన్నా తీవ్రంగా ఉండాలి ఎందుకంటే సమాప్తి యొక్క సమయాన్ని తీసుకురావడానికి విశేష ఆత్మలైన మీరు నిమిత్తులు. తీవ్ర గతితో సంవత్సరమైతే సంపన్నమైపోయింది. అసలు ఈ సంవత్సరం ఎలా పూర్తయిపోయిందో తెలిసిందా? కావున చెక్ చేసుకోండి, విశేష ఆత్మనైన నా పరివర్తన యొక్క గతి తీవ్రంగా ఉందా లేక అప్పుడప్పుడు తీవ్రంగా, అప్పుడప్పుడు మధ్యస్థంగా ఉందా?

ఎవరికైతే పాత సంస్కారాలతో మరియు ప్రపంచంతో సంబంధం ఉండదో, వారిని ఫరిశ్తా అని అంటారు. కావున చెక్ చేసుకోండి, పాత ప్రపంచంతో ఏదైనా ఆకర్షణ, సంబంధం రూపంలో కానీ, తమ దేహం వైపు ఆకర్షణ కానీ లేదా ఎవరైనా దేహధారి వ్యక్తి పైన ఆకర్షణ కానీ, ఏదైనా వస్తువుపై ఆకర్షణ కానీ ఎంత పర్సెంటేజ్ ఉంది? అలాగే పాత సంస్కారాల వైపు ఆకర్షణ, సంకల్ప రూపంలో కానీ, వృత్తి రూపంలో, వాణి రూపంలో, సంబంధ సంపర్కాలలో అనగా కర్మ రూపంలో ఎంత పర్సెంటేజ్ ఉంది? ఫరిశ్తా అనగా డబల్ లైట్. కావున వాస్తవమైన లైట్ స్వరూపము స్మృతి స్వరూపంలో ఎంతవరకు ఉంది? దానితోపాటు లైట్ అనగా తేలికదనము, స్వ పరివర్తన యొక్క పురుషార్థంలో ఎంతవరకు లైట్ అనగా తేలికగా ఉన్నారు? మనసు అనగా సంకల్ప శక్తిలో వ్యర్థాన్ని సమర్థములోకి పరివర్తన చేయడంలో అనగా వ్యర్థము యొక్క భారాన్ని తేలిక చేయడంలో ఎంతవరకు సఫలమయ్యారు? ఇదే రకంగా వ్యర్థ సమయము, వ్యర్థ సాంగత్యము, వ్యర్థ వాతావరణము – వీటన్నింటినీ ఎంతవరకు పరివర్తన చేయడంలో తేలికగా ఉన్నారు? బ్రాహ్మణ పరివారముతో సంబంధంలో, సేవ యొక్క సంబంధంలో ఎంతవరకు తేలికగా ఉన్నారు? దీన్నే ఫరిశ్తా స్వరూపము యొక్క తీవ్ర గతి యొక్క స్థితి అని అంటారు. ఈ విధితో చెక్ చేసుకోండి మరియు భవిష్యత్తు కోసం చేంజ్ అనగా పరివర్తన చేయండి. తమ బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను సహజమైన స్వభావంగా తయారుచేసుకోవడము, దీనినే సహజ పురుషార్థము అని అంటారు. కేవలం నేను ఒక విశేష ఆత్మను – ఈ స్మృతి స్వరూపంలో స్థితులవ్వండి, అప్పుడు తండ్రి సమానంగా అవ్వడము అతి సహజంగా అనుభవం చేస్తారు ఎందుకంటే స్మృతి స్వరూపము నుండి సమర్థీ స్వరూపముగా అయిపోతారు. సంవత్సరమైతే పూర్తయిపోయింది. బాప్ దాదా రిజల్టు అయితే చూస్తారు కదా. మరి రిజల్టులో యథాశక్తిగా మెజారిటీ ఉన్నారు మరియు యథాశక్తి యొక్క మెజారిటీతో పోలిస్తే సదా శక్తిశాలిగా ఉన్నవారు మైనారిటీలో ఉన్నారు.

స్మృతి దినమును కూడా చాలా స్నేహంతో జరుపుకున్నారు. ఇప్పుడు విశేషంగా ఎలాగైతే స్నేహంతో జరుపుకున్నారో, అలాగే స్నేహం యొక్క ఋజువులో తండ్రి సమానంగా స్మృతి స్వరూపముగా అవ్వాల్సిందే. రిజల్ట్ విన్నారా? ఇక ముందు ఏం చేయాలి? యథాశక్తిగా ఉండాలా లేక సదా శక్తి స్వరూపులుగా ఉండాలా? మరి చూస్తాము, ఈ సంవత్సరంలో మెజారిటీ సదా శక్తిశాలి యొక్క ఋజువును ఎంతవరకు ఇస్తారు? టీచర్లు ఏం భావిస్తున్నారు? ఏ లైన్ లోకి వస్తారు? సదా శక్తిశాలి! అందరిది టి.వి.లో ఫొటో తీయబడుతుంది. ఏం జరిగినా కానీ, ఎటువంటి పరిస్థితి ఏర్పడినా కానీ సదా శక్తిశాలి. పేర్లు నోట్ అవుతున్నాయి కదా, ఎవరెవరు ఏ గ్రూపులో వచ్చారు? ఇప్పుడు టీచర్ల యొక్క సమ్మేళనము జరగనున్నది కదా. అప్పటివరకు టీచర్లందరి రిజల్టు ఏముంటుంది? ఎవరికైతే చేసేది ఉందో, వారు ఎప్పుడో చేస్తాము అని ఆలోచించరు. దృఢ సంకల్పము యొక్క అర్థమే – ఇప్పుడు. సాధారణ సంకల్పం యొక్క అర్థము – ఎప్పుడో అవుతుందిలే! మరి ‘ఎప్పుడో’ అనేవారిగా ఉన్నారా లేక ‘ఇప్పుడు’ అనేవారిగా ఉన్నారా? శక్తి సైన్యము చాలా పెద్ద సైన్యము. ‘ఎప్పుడో’ అనేవారా లేక ‘ఇప్పుడు’ అనేవారా? పాండవులు ఏమని భావిస్తారు? చూడండి, అందరి పేర్లు నోట్ అయి ఉన్నాయి. ఇప్పుడు పేర్లను వినిపించము, ఆఖరుకు పేర్లను వినిపించే సమయము కూడా వస్తుంది. అర్థమైందా!

అందరికన్నా ఎక్కువ సంఖ్య ఏ జోన్ వారిది వచ్చింది? చూస్తాము, పంజాబ్, ఇండోర్ ఏం అద్భుతము చేసి చూపిస్తారు? టీచర్లు కూడా ఎక్కువగా వస్తారు, సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు టీచర్లు కూడా ఎక్కువగా ఉంటారు. పంజాబ్ వారు నంబరువన్ తీసుకుంటారా లేక సెకండు నంబరా? ఇండోర్ వారు కూడా నంబరువన్ తీసుకుంటారా? మరియు కర్నాటకవారు ఏం చేస్తారు? ఎటువంటి నాటకాన్ని చూపిస్తారు? కర్-నాటక్ (నాటకం చేసి చూపించండి), మరి హీరో నాటకాన్ని చూపించండి, అలాంటి-ఇలాంటి నాటకాన్ని చూపించకండి. మరియు మహారాష్ట్రవారైతే మహాన్ గానే అవుతారు కదా? మరియు యు.పీ.ని ఏమంటారు? యు.పీ.లో నదులు ఉన్నాయి అనగా యు.పీ. పతితులను పావనంగా చేసేది. పావనంగా అవ్వడము-తయారుచేయడంలో నంబరువన్. మరి యు.పీ.వారు కూడా నంబరువన్ అవుతారు. ఈ సమయంలోనైతే ఎవరినీ నంబరు టూ అని అనరు. రాజస్థాన్ అయితే ఉన్నదే లక్కీ, రాజస్థాన్ లోనే చరిత్ర భూమి ఉంది. హెడ్ క్వార్టర్ రాజస్థాన్ లో ఉంది కదా. మరి ఎక్కడైతే హెడ్ క్వార్టర్ ఉందో అది ఏమవుతుంది? హెడ్ అవుతుంది కదా! అందరూ సంతోషంతో నంబరువన్ అని అంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళి ఈ విధంగా అనకండి – ఏం చేయాలి… చేయలేకపోతున్నాము… కావాలనుకోవడం లేదు కానీ జరిగిపోతుంది… ఇలాంటి భాషను ఆలోచనలోకి కూడా తీసుకురాకండి. అచ్ఛా, డబుల్ విదేశీయులు కూడా సేవలో మంచిగా రేస్ చేస్తున్నారు మరియు రేస్ లో నంబరువన్ లోకి రావాలి కదా. దేశంలో ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వడములో విదేశము మంచిగా నిమిత్తముగా అయ్యింది. ఈ ధైర్యాన్ని ఇప్పించిన కారణంగా ఎక్స్ ట్రా సహాయం కూడా లభిస్తుంది. అర్థమైందా! దీనినే స్మృతిలో పెట్టుకొని సహజంగా ముందుకు వెళ్తూ ఉండండి మరియు ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న సర్వ విశేష ఆత్మలకు, సదా సాకార బ్రహ్మా తండ్రి యొక్క శ్రేష్ఠ కర్మలను ఫాలో చేసే కర్మయోగీ ఆత్మలకు, సదా విశేషతలను సహజము మరియు స్వభావముగా తయారుచేసుకునే కోటిలో ఏ కొందరిగానో ఉన్న ఆత్మలకు, సదా దృఢ సంకల్పము ద్వారా విశేష జన్మ, ధర్మము మరియు కర్మ యొక్క స్మృతి స్వరూప ఆత్మలకు బాప్ దాదా యొక్క విశేషతా సంపన్నమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో కలయిక:- బ్రాహ్మణులైన మీరు ఎంతగా సంపన్నముగా అవుతూ ఉంటారో, అంతగా భవిష్యత్తులో ప్రకృతి కూడా ప్రగతిని ప్రాప్తి చేసుకుంటుంది ఎందుకంటే ప్రకృతి ఎప్పటికప్పుడు తన సిగ్నల్ ను చూపిస్తూ ఉంది. మరి ఎంత ప్రకృతి యొక్క అలజడి ఉందో, అంత స్థిరమైన స్థితి ప్రకృతిని పరివర్తన చేస్తుంది. ఎంతమంది ఆత్మలు ఎప్పటికప్పుడు దుఃఖము యొక్క అలలోకి వస్తారు. మరి అటువంటి దుఃఖితులైన ఆత్మలకు ఆధారము తండ్రి మరియు మీరే. కావున దయ కలుగుతుంది కదా. ఎప్పుడైతే సమాచారము వింటారో, అప్పుడు మనసులో ఏమనిపిస్తుంది? నథింగ్ న్యూ, తమ స్థిరమైన స్థితి ఉండడమైతే సరైనదే కానీ ప్రకృతి యొక్క అలజడిలో ఆత్మలు ఎప్పుడైతే ఆర్తనాదాలు చేస్తారో, వారు ఎవరి కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు? మరి ఎప్పుడైతే వారు దయ, కృప యాచిస్తున్నారో, అప్పుడు మీ వద్దకు వారి దయ కోసం చేసే పిలుపు చేరుకుంటుంది కదా! ఈ చిన్న-చిన్న ఆపదలు ఇంకా విలవిలలాడేలా చేస్తాయి. బ్రాహ్మణులు సంపన్నంగా అయితే దుఃఖం యొక్క ప్రపంచము సంపన్నమైపోతుంది. మరి దయ కలుగుతుందా లేదా? దయ కలుగుతున్నప్పుడు మరి ఏం చేస్తున్నారు? వారు కూడా ఈశ్వరీయ పరివారానికి చెందినవారే కదా. మరి పరివారం యొక్క ఎటువంటి దుఃఖమైనా సుఖంలోకి పరివర్తన చేసే సంకల్పమైతే వస్తుంది కదా. ఎవరైనా పరివారంలో వ్యాధిగ్రస్థులుగా అయితే ఏం సంకల్పము వస్తుంది? త్వరగా నయమైపోవాలి. ఆర్తనాదాలు చేస్తూ-చేస్తూ మరణించడము మరియు ఒక్క దెబ్బతో పరివర్తన జరగడము, తేడా అయితే ఉంది కదా. మహావినాశనము మరియు రిహార్సల్ యొక్క వినాశనము, తేడా ఉంది. మహావినాశనము అనగా మహాన్ పరివర్తన. దానికి నిమిత్తులుగా మీరు ఉన్నారు. సంపన్నులుగా అయినట్లయితే సమాప్తి జరుగుతుంది. మరి ఎవరైతే వ్యాకులతలో ఉన్నారో, వారు ప్రత్యక్షత యొక్క తెర తెరుచుకోవాలి అని భావిస్తారు, కానీ స్టేజి పైకి వచ్చే హీరో యాక్టరు సంపన్నంగా తయారవ్వాలి కదా, అప్పుడే తెర తెరుచుకుంటుందా లేక సగంలోనే తెరుచుకుంటుందా? పరివర్తన యొక్క శుభ భావనను తీవ్రము చేయడము అనగా స్వయాన్ని తీవ్ర గతితో సంపన్నంగా చేసుకోవడము. మీరు కూడా ఒకసారి ఒకలాగ, ఇంకోసారి ఇంకోలాగ ఉంటే, ప్రకృతి కూడా ఒకసారి చాలా తీవ్ర గతితో కార్యం చేస్తుంది, ఇంకోసారి చల్లబడిపోతుంది. మరి ఇప్పుడేం చేయాలి? స్వయం పట్ల కానీ, సర్వాత్మల పట్ల కానీ దయాభావనను ఇమర్జ్ చేయండి. దయ కలుగుతుంది కదా! అలను వ్యాపింపజేయండి. దయా భావనతో విఘ్నాలు కూడా సహజంగానే సమాప్తమైపోతాయి. ఎక్కడైతే దయ ఉంటుందో, అక్కడ నీది-నాది అనే అలజడి ఉండదు. పూజ్య స్వరూపమును, దయాహృదయాన్ని ధారణ చేయండి. సరేనా. ఇప్పుడు ఈ అలను వ్యాపింపజేయండి. ప్రతి సంకల్పములో దయాహృదయము. సంకల్పంలో ఉన్నట్లయితే వాణి మరియు కర్మ స్వతహాగానే అయిపోతాయి. అందరూ ఏమని ఆర్తనాదాలు చేస్తారు? దయ చూపించండి-దయ చూపించండి. అచ్ఛా!

అవ్యక్త బాప్ దాదా యొక్క వ్యక్తిగత మిలనము

మాయ యొక్క ఛాయ నుండి రక్షించుకునే సాధనము బాప్ దాదా యొక్క ఛత్రఛాయ

సదా స్వయాన్ని బాప్ దాదా యొక్క ఛత్రఛాయ క్రింద ఉండేవారిగా సదా సురక్షితంగా ఉండే ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? సదా ఛత్రఛాయ ఉందా లేక అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోతున్నారా? అయితే తండ్రి ఛత్రఛాయ అయినా ఉంటుంది లేక మాయ ఛాయ అయినా ఉంటుంది. కావున మాయ యొక్క ఛాయ నుండి రక్షించుకునేందుకు సాధనము ఛత్రఛాయ. మరి ఛత్రఛాయలో ఉండేవారు ఎంత సంతోషంగా ఉంటారు ఎందుకంటే నిశ్చింతా చక్రవర్తులుగా అయ్యారు కదా. చింత ఉన్నట్లయితే సంతోషము మాయమైపోతుంది. ఎప్పుడైనా చూడండి, సంతోషము మాయమైపోతే కారణం ఏముంటుంది? ఏదో ఒక చింత, వ్యాకులత, భారము సంతోషాన్ని మాయం చేస్తుంది. మరియు సంతోషము మాయమై, బలహీనంగా అయినట్లయితే మాయ ఛాయ యొక్క ప్రభావము తప్పకుండా పడుతుంది. బలహీనత మాయను ఆహ్వానిస్తుంది. ఎలాగైతే శారీరక బలహీనత వ్యాధులను ఆహ్వానిస్తుందో, అలాగే ఆత్మిక బలహీనత మాయను ఆహ్వానిస్తుంది. తర్వాత ఆ ఛాయ నుండి బయటపడేందుకు ఎంతగా శ్రమ చేయవలసి వస్తుంది. ఒకవేళ మాయ యొక్క ఛాయ స్వప్నంలో పడితే స్వప్నం కూడా వ్యాకులపరుస్తుంది. అప్పుడు బ్రాహ్మణుల నుండి క్షత్రియులుగా అయిపోతారు, అప్పుడు యుద్ధం చేయవలసి వస్తుంది. క్షత్రియ జీవితం శ్రమతో కూడుకున్నది మరియు బ్రాహ్మణ జీవితం సంతోషంతో కూడుకున్నది. మరి ఏది ఇష్టము? అప్పుడప్పుడు యుద్ధం చేయవలసి వస్తుందా? యుద్ధం చేయడము మంచిగా అనిపిస్తుందా? చిన్నని వ్యర్థ సంకల్పము యొక్క ఛాయ అయినా ఎంతగా శ్రమ చేయిస్తుంది, అందుకే సదా తండ్రి స్మృతి అనే ఛత్రఛాయలో ఉండండి. స్మృతియే ఛత్రఛాయ. మరి సదా కాలము కోసం ఛత్రఛాయలో ఉండడం వస్తుందా? అప్పుడప్పుడు కోసం కాదు, సదా. అవినాశీ తండ్రి కదా. కావున వారసత్వం కూడా సదా కోసం తీసుకోవాలి. సదా సంతోషంలో ఉండేవారు. ఛత్రఛాయ అనగా సంతోషంలో ఉండడము. నిశ్చింతగా ఉంటారు కదా. అన్ని చింతలను తండ్రికి ఇచ్చేసారా లేదా ఒకటి-రెండు సంభాళించి పెట్టుకున్నారా? ఏం చేయాలి… ఎలా చేయాలి… ఈ పదాలు చింతకు సంబంధించినవి. నిశ్చింతగా ఉండేవారి పదాలు సదా విజయానికి చెందినవిగా ఉంటాయి. ‘ఏమిటి’, ‘ఎలా’ అని ఈ విధంగా ఉండవు. మరి ఎల్లప్పుడూ మేమందరము తండ్రి ఛత్రఛాయలో ఉండేవారము అని గుర్తు పెట్టుకోండి. అన్ని వైపులకు తిరిగి వచ్చేవారు కాదు. సంకల్పంలో కూడా అన్ని వైపులా తిరిగి వచ్చినట్లయితే అలా తిరిగి వచ్చేవారు నష్టపోతారు. మీరైతే అమరులు కదా. అమరులుగా అయ్యాము – ఈ స్మృతి సదా స్వయాన్ని కూడా నిశ్చింతగా మరియు ఇతరులను కూడా నిశ్చింతగా తయారుచేస్తూ ఉంటుంది. సదా సంతోషంలో పాటను పాడుతూ ఉంటారు – పొందాల్సినదేదో పొందేసాము. పిల్లలుగా అవ్వడము అనగా పొందడము. పిల్లలుగా అయ్యారు అంటే పొందేసారు. అచ్ఛా!

వరదానము:-

సర్వ ఆత్మిక ఖజానాలతో సంపన్నముగా అయి సదా సంతుష్టముగా ఉండే ఆల్రౌండ్ సేవాధారి భవ

ఆల్రౌండ్ సేవాధారులు అనగా మాస్టర్ సుఖ దాత, మాస్టర్ శాంతి దాత, మాస్టర్ జ్ఞాన దాత. దాత సదా సంపన్నమూర్తులుగా ఉంటారు. స్వయం ఎలా ఉంటారో ఇతరులను కూడా అలాగే తయారుచేస్తారు. ఆత్మిక సేవాధారి అనగా ఎవర్రెడీ మరియు ఆల్రౌండ్. ఎవరైతే సంపన్నముగా ఉంటారో, వారే ఆల్రౌండర్లుగా అవ్వగలరు, సంపన్నులుగా ఉన్నవారే సంతుష్టంగా ఉంటారు మరియు అందరినీ సంతుష్టపరుస్తారు. ఏ రకమైన అప్రాప్తి అయినా అసంతుష్టతకు జన్మనిస్తుంది. సంపన్నులుగా మరియు దాతగా అవ్వడమే సంతుష్టముగా ఉండడానికి మరియు సంతుష్టపరిచేందుకు విధి.
స్లోగన్:-శుభ భావన, శుభ కామన యొక్క స్వర్ణిమ కానుక తోడుగా ఉన్నట్లయితే ఏ ఆత్మనైనా పరివర్తన చేయగలరు.

సూచన:-

ఈ రోజు నెలలో మూడవ ఆదివారము, రాజయోగీ తపస్వీ సోదరీ సోదరులందరూ సాయంత్రము 6.30 నుండి 7.30 గం. వరకు విశేషంగా యోగాభ్యాసము సమయంలో అనుభవం చేయండి – జ్ఞాన సూర్యుడు, సర్వ శక్తివంతుడైన పరమాత్మ కిరణాలు నాపై పడుతున్నాయి మరియు నా నుండి మొత్తం ప్రపంచానికి వెళ్తున్నాయి. దీని ద్వారా ప్రపంచం నుండి అజ్ఞాన అంధకారము దూరమవుతూ ఉంది

Back To Top