TELUGU MURLI 25-02-2023

                    25-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – శ్రీ శ్రీ యొక్క శ్రేష్ఠ మతముపై నడవడం ద్వారానే మీరు నరుని నుండి శ్రీ నారాయణునిగా అవుతారు, నిశ్చయములోనే విజయము ఉంది’’

ప్రశ్న:-

ఈశ్వరుని డైరెక్ట్ రచనలో ఏ విశేషత తప్పకుండా ఉండాలి?

జవాబు:-

సదా హర్షితముగా ఉండే విశేషత. ఈశ్వరుని రచన యొక్క ముఖము ద్వారా ఎల్లప్పుడూ జ్ఞాన రత్నాలే వెలువడుతూ ఉండాలి. నడవడిక చాలా రాయల్ గా ఉండాలి. తండ్రి పేరును అప్రతిష్ఠపాలు చేసే నడవడిక ఉండకూడదు. ఏడ్వడము, కొట్లాడడము-గొడవపడడము, అశుద్ధమైనవాటిని తినడము… ఇవి ఈశ్వరీయ సంతానం యొక్క లక్షణాలు కావు. ఈశ్వరీయ సంతానముగా పిలవబడేవారు ఒకవేళ ఏడ్చినట్లయితే, ఏదైనా తప్పుడు పని చేసినట్లయితే, తండ్రి పరువును తీస్తారు, అందుకే పిల్లలు చాలా-చాలా జాగ్రత్తగా ఉండాలి. సదా ఈశ్వరీయ నషాలో హర్షితముఖులుగా ఉండాలి.

ఓంశాంతి.

పిల్లల ముఖాన్ని చూడవలసి ఉంటుంది. వీరు ఏమీ సాధువు, సన్యాసి కాదు, ఇక్కడ బాప్ దాదా మరియు పిల్లలు ఉన్నారు. దీనిని ఈశ్వరీయ కుటుంబ పరివారము అని అంటారు. ఈశ్వరుడు అనగా పరమపిత, వారి పుత్రుడు ఈ బ్రహ్మా, ఆ తర్వాత మీరు బ్రహ్మాకుమారులు, కుమారీలు. వారు విశ్వానికి తండ్రి. మొత్తం ప్రపంచానికి ముగ్గురు తండ్రులైతే తప్పకుండా ఉంటారు. ఒకరు నిరాకార తండ్రి, రెండవవారు ప్రజాపిత బ్రహ్మా, మూడవవారు లౌకిక తండ్రి. కానీ ఇది ఎవరికీ తెలియదు. చిత్రాలు మొదలైనవాటిని కూడా తయారుచేస్తారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అనేది తెలియదు. శివుని చిత్రము కూడా ఉంది. బ్రహ్మా, విష్ణు, శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ వారు ఏ పాత్రను అభినయిస్తారు? వారి పేరు ఎందుకు గాయనం చేయబడుతుంది… ఇది ఎవ్వరికీ తెలియదు. చాలానే చదివి ఉన్నారు, లక్షల సంఖ్యలో ప్రసంగాలను వినడానికి వెళ్తారు కానీ పిల్లలైన మీతో పోలిస్తే వారికి ఏమీ తెలియనట్లే. పూర్తిగా తుచ్ఛ బుద్ధి కలవారిగా ఉన్నారు. బాబా వచ్చి మిమ్మల్ని స్వచ్ఛ బుద్ధి కలవారిగా తయారుచేస్తారు. మీకు అంతా తెలుసు. ఉన్నతోన్నతమైనవారు తండ్రి. ఇప్పుడు కొత్త రచనను రచిస్తున్నారు. కొత్త ప్రపంచములో కొత్త రచన కావాలి కదా. గాంధీజీ కూడా కొత్త ప్రపంచము, కొత్త రాజ్యం కావాలి అని అనేవారు. భారత్ లో మాత్రమే సత్యయుగములో ఒకే రాజ్యం ఉంటుంది. కేవలం సూర్యవంశీయులైన లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉంటుంది, తర్వాత చంద్రవంశీయుల రాజ్యం వచ్చినప్పుడు సూర్యవంశము కనుమరుగైపోతుంది. అప్పుడు దానిని చంద్రవంశీయుల రాజ్యమని అంటారు. అయితే, ఒకప్పుడు లక్ష్మీ-నారాయణులు ఉండి వెళ్ళారు అన్నది వారికి తెలుసు. కానీ అది సీత-రాముల రాజ్యముగానే పిలవబడుతుంది. కావున బ్రహ్మా ఏమీ రచయిత కాదు. రచయిత ఒక్క తండ్రి మాత్రమే. రచయిత అయిన శివబాబా వస్తారు, వారు వచ్చి – తాము ఏ విధంగా కొత్త రచనను రచిస్తున్నారు అన్నది చెప్తారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులైన మిమ్మల్ని రచిస్తున్నాను. కావున తండ్రి నుండి తప్పకుండా వారసత్వము లభించాలి. ఈ చిన్న విషయాన్ని అయినా ఎవరైనా అర్థం చేసుకుంటే 21 జన్మల కోసం అహో సౌభాగ్యము. ఎప్పుడూ దుఃఖితులుగా లేక విధవలుగా అవ్వరు. ఎవరి బుద్ధిలోనూ ఈ నషా పూర్తిగా లేనే లేదు. కానీ వాస్తవానికి ఇది చాలా సహజము.

పాట:-

భాగ్యాన్ని మేల్కొలుపుకొని వచ్చాను… (తక్దీర్ జగాకర్ ఆయీ హూ…)

ఓంశాంతి.

మీరు ఈ పాఠశాలలోకి వస్తారు, ఇది ఎవరి పాఠశాల? ఇది శ్రీమత్ భగవద్ యొక్క పాఠశాల. తర్వాత దానికి గీత అన్న పేరును పెట్టారు. శ్రీమతము శ్రేష్ఠాతి-శ్రేష్ఠమైన పరమాత్మది, వారు తమ పిల్లలకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నారు. ఇంతకుముందు అయితే మీరు రావణుడి ఆసురీ మతముపై నడుస్తూ వచ్చారు. ఇప్పుడు ఈశ్వరుడైన తండ్రి మతము లభిస్తుంది. నేను కేవలం మీకు తండ్రిని మాత్రమే కాను. నేను మీకు తండ్రిని కూడా, టీచరును కూడా, సద్గురువును కూడా. ఎవరైతే నాకు చెందినవారిగా అవుతారో, వారంటారు – శివబాబా, బ్రహ్మా ముఖము ద్వారా మేము మీకు చెందినవారిగా అయ్యాము. మేము మీ వారము, మీకు చెందినవారిగానే ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు. బాబా కూడా అంటారు, మీరు నా వారు, ఇప్పుడు నా మతముపై నడవండి. శ్రీమతముపై నడవడం ద్వారా మీరు శ్రేష్ఠమైన లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇది గ్యారంటీ. కల్పక్రితం కూడా మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారుచేసాను. ఈ విధంగా మనుష్యులు ఎవ్వరూ అనలేరు. ఇలా అనడం ఎవరికీ రాదు. తండ్రే ఇలా అంటారు, నా పిల్లలూ, నేను మీకు రాజయోగాన్ని నేర్పించి తిరిగి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. సత్యయుగము అల్లాహ్ యొక్క ప్రపంచము. భగవతి, భగవానులను అల్లాహ్ అని అంటారు. ఈ సమయంలో అందరూ తలక్రిందులుగా వేలాడుతూ ఉన్నారు. గ్రద్ద వచ్చి పొడుస్తుంది కదా. ఇక్కడ కూడా మాయ పొడుస్తుంది. దుఃఖితులుగా అవుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, మిమ్మల్ని ఈ దుఃఖాల నుండి, విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి తీసుకువెళ్తాను. వాస్తవానికి క్షీర సాగరమైతే ఏదీ లేదు. విష్ణువు సూక్ష్మవతనములో క్షీర సాగరములో ఉంటారని అంటారు. ఈ పదాలు మహిమకు సంబంధించినవి. ఇప్పుడు జ్ఞానసాగరుడినైన నేను పిల్లలైన మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. మీరు కామ చితిపై కూర్చోవడంతో కాలి నల్లగా అయిపోతారు, నేను వచ్చి మీపై జ్ఞాన వర్షాన్ని కురిపిస్తాను, దానితో మీరు తెల్లగా అవుతారు. శాస్త్రాలలో ఏ పదాలు ఉన్నాయంటే, రాజు అయిన సాగరుడి పిల్లలు కాలి మరణించారు అని. విషయాలనైతే ఎన్నో తయారుచేసారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ విషయాలన్నింటినీ బుద్ధి నుండి తొలగించండి. ఇప్పుడు నేను వినిపించేది వినండి. సంశయబుద్ధి వినశ్యంతి. ఇప్పుడు నాపై నిశ్చయం పెట్టుకున్నట్లయితే నిశ్చయబుద్ధి విజయంతి. విజయ మాలలోని మణులుగా అవుతారు. మాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఎవరైతే మంచి సేవ చేస్తారో వారి విజయమాల తయారవుతుంది. అందరికన్నా మంచి సేవ చేసే మణులు రుద్ర మాలలో ముందుకు వెళ్తారు. తర్వాత విష్ణు మాలలో ముందుకు వెళ్తారు. నంబరువారుగా 108, ఆ తర్వాత 16,000ను కూడా కలపండి. సత్య, త్రేతాయుగాలలో కేవలం 108 మంది రాకుమారులు-రాకుమార్తెలే ఉంటారని కాదు, వృద్ధి జరుగుతూ మాల పెరుగుతూ ఉంటుంది. ప్రజల వృద్ధి జరిగితే తప్పకుండా రాకుమారులు-రాకుమార్తెల వృద్ధి కూడా జరుగుతుంది. తండ్రి అంటారు, ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఓ నా ప్రియమైన పిల్లలూ, నన్ను తెలుసుకోవడం ద్వారా మీరు సృష్టి వృక్షాన్ని తెలుసుకుంటారు. ఈ వృక్షము ఎప్పుడూ పాతదిగా అవ్వదు. భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇది మీకు తెలుసు. ఇది కల్పవృక్షము. కింద కామధేనువు కూర్చొని ఉన్నారు. తప్పకుండా వారికి తండ్రి కూడా ఉంటారు. ఇప్పుడు మీరు కూడా కల్పవృక్షము కింద కూర్చొన్నారు, తర్వాత మీ కొత్త వృక్షము ప్రారంభమవుతుంది. ప్రజలైతే లక్షల సంఖ్యలో తయారయ్యారు, ఇంకా తయారవుతూ ఉంటారు. ఇకపోతే, రాజుగా అవ్వడము, ఇది కొద్దిగా కష్టము. ఇందులో కూడా సాధారణమైనవారు, పేదవారు మేల్కొంటారు.

బాబా అంటారు, పేదల పెన్నిధిని నేను. దానం కూడా పేదవారికే ఇవ్వడం జరుగుతుంది. అహల్యలు, నడుము వంగిపోయినవారు, పాపాత్ములు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి-ఇలాంటివారికి నేను వచ్చి వరదానము ఇస్తాను. మీరు కూర్చుని పూర్తిగా సన్యాసులకు కూడా జ్ఞానాన్ని ఇస్తారు, బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎవరూ అవ్వలేరు. ఎవరైతే దేవతా వర్ణానికి చెందినవారో, వారు బ్రాహ్మణ వర్ణములోకి రావాలి, అప్పుడు మళ్ళీ దేవతా వర్ణములోకి వెళ్ళగలరు. నీవే తల్లివి, తండ్రివి… అని పాడడమైతే అందరూ పాడుతారు కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా అలా ఉన్నారు. ఇది బ్రాహ్మణుల కొత్త రచన. ఉన్నతోన్నతమైన పిలక స్థానము బ్రాహ్మణులది, ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, ఆ తర్వాత ఈశ్వరీయ సంప్రదాయంవారు. కావున మీకు ఇంతటి నషా ఉండాలి. మనం ఈశ్వరునికి మనవలము, మనవరాళ్ళము, ప్రజాపితకు పిల్లలము. ఇప్పుడు ఈశ్వరుని పిల్లలైతే సదా హర్షితముగా ఉండాలి. ఎప్పుడూ ఏడవకూడదు. ఇక్కడ బ్రహ్మాకుమారులు, కుమారీలుగా పిలువబడేవారు కూడా చాలా మంది ఏడుస్తారు. విశేషముగా కుమారీలు. పురుషులు ఏడవరు. అలా ఏడ్చేవారు పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. వారు చూడడానికి మాయకు బానిసలుగా కనిపిస్తారు. శివబాబాకు చెందినవారిగా కనిపించరు. బాబా లోలోపల అర్థం చేసుకుంటారు కానీ బయటకు ఏమైనా చూపిస్తారా. లేదంటే ఇంకా పడిపోతారు. బాబా అంటారు, స్వయాన్ని సంభాళించుకోండి. సద్గురువును నిందింపజేసేవారు ఎప్పుడూ ఉన్నత స్థానాన్ని పొందరు. మేము రాజ్య సింహాసనాన్ని ఎప్పటికీ పొందమని వారు అర్థం చేసుకోవాలి. మీరైతే ఎల్లప్పుడూ హర్షితముగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఇక్కడ హర్షితముగా ఉంటారో, అప్పుడు 21 జన్మలు హర్షితముగా ఉంటారు. భాషణ చేయడము అంత గొప్ప విషయమేమీ కాదు, అది చాలా సహజము. శ్రీకృష్ణుడిలా తయారవ్వాలంటే ఇప్పుడు సదా హర్షితముఖులుగా ఉండండి మరియు నోటి నుండి రత్నాలు వెలువడుతూ ఉండాలి. ఆత్మనైన నాకు పరమపిత పరమాత్ముని ధనము లభించింది. ఏదైతే ఆత్మనైన నాలో ధారణ అవుతుందో, అది నేను నా నోటి ద్వారా దానం చేస్తూ ఉంటాను. ఏ విధముగా బాబా శరీరాన్ని లోన్ గా తీసుకొని దానం చేస్తూ ఉంటారో, అటువంటి అవస్థ కావాలి. బాబా బాహ్యంగా ప్రేమనిస్తారు కానీ ఫలానావారి నడవడిక అప్రతిష్ఠపాలు చేసేలా ఉంది అని చూసినప్పుడు, ఇక వీరు ఉన్నత స్థానాన్ని పొందలేరని మనసులో తెలుస్తుంది. బాబాకు ఈ విధమైన ఫిర్యాదులు కూడా వస్తాయి – వీరు ఈశ్వరీయ సంతానము, మరి ఎందుకు ఏడుస్తారు? పరువు అయితే ఇక్కడ ఈశ్వరుడిది పోతుంది కదా. ఏడుస్తారు, కొట్లాడుతారు. అశుద్ధమైనవి తింటారు. దేవతలు ఏడిస్తే అది వేరే విషయము, ఇక్కడ డైరెక్ట్ ఈశ్వరుని సంతానము ఏడిస్తే ఇక ఎటువంటి గతి ఉంటుంది. తండ్రి పరువును పోగొట్టే విధమైన తప్పుడు పనులు జరగకూడదు. ప్రతి విషయములో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు.

ఈ సమయంలోనైతే మనుష్యులు ఎంతమంది ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి – ఒకదానితో మరొకటి కలవదు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, ఇక్కడ మీరు మీ ఉన్నతోన్నతమైన భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు కూర్చున్నారు. ఉన్నతమైన భాగ్యాన్ని పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ తయారుచేయలేరు. సత్యయుగీ సృష్టి ఆదిలో లక్ష్మీ-నారాయణులు ఉంటారు. వారిని భగవంతుడే రచిస్తారు. వారు లక్ష్మీనారాయణులకు రాజ్యాన్ని ఎలా ఇచ్చారు? యథా రాజా రాణి తథా ప్రజాగా ఎలా అయ్యారు, ఇది ఎవరికీ తెలియదు. బాబా అర్థం చేయిస్తారు, కల్పము యొక్క సంగమయుగములోనే నేను వచ్చి లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్ని స్థాపన చేస్తాను. బాబా అంటారు, మీకు రాజ్య తిలకాన్ని ఇస్తున్నాను. స్వర్గ రచయితనైన నేను మీకు రాజ్య తిలకాన్ని ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? తులసీదాస్ చందనాన్ని అరగదీసారు… అని అంటారు కదా. ఇది ఇక్కడి విషయమే. వాస్తవానికి అక్కడ రాముడంటే శివబాబా. చందనాన్ని అరగదీసే విషయమేమీ లేదు. లోపల బుద్ధి ద్వారా తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మాయాపురిని మర్చిపోండి, ఇందులో అపారమైన దుఃఖము ఉంది. ఇది స్మశానవాటిక. మధురమైన బాబాను మరియు మధురమైన సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ ప్రపంచమైతే సమాప్తం అవ్వనున్నది. విదేశాలలోనైతే బాంబులు మొదలైనవి వేస్తే అన్ని ఇళ్ళు పడిపోతాయి, అందరూ మరణించవలసిందే. పనికిరాని చెత్త అంతమవ్వనున్నది. దేవతలు పనికిరాని చెత్తలో ఉండరు. లక్ష్మిని ఆహ్వానించినప్పుడు అంతా శుభ్రం చేస్తారు కదా. ఇప్పుడు లక్ష్మీ-నారాయణులు వచ్చినట్లయితే మొత్తం సృష్టి శుభ్రమైపోతుంది మరియు అన్ని ఖండాలు సమాప్తమైపోతాయి, ఆ తర్వాత దేవతలు వస్తారు. వారు వచ్చి తమ మహళ్ళను నిర్మిస్తారు. బొంబాయి ఇంతగా ఉండేది కాదు. పల్లెటూరిలా ఉండేది, ఇప్పుడు చూడండి, ఎలా అయ్యింది, మళ్ళీ అదే విధంగా అవుతుంది, ఇక ఇతర ఖండాలు ఉండవు. సత్యయుగములో ఉప్పు నీటి తీరాలపై గ్రామాలు ఉండవు. మధురమైన నదీ తీరాలపై ఉంటాయి. తర్వాత మెల్లమెల్లగా వృద్ధి చెందుతాయి. మద్రాస్ మొదలైనవి ఉండవు. బృందావనము, గోకులము మొదలైనవి నదీ తీరాలపై ఉంటాయి, వైకుంఠం యొక్క మహళ్ళను అక్కడ చూపిస్తారు. మనం ఇక్కడకు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. కేవలం మనిషి నుండి దేవత అని కూడా అనకండి. దేవతలకు రాజధాని అయితే ఉంటుంది కదా. అందులో మనం రాజ్యం తీసుకునేందుకు వచ్చాము. దీనిని రాజయోగము అనే అంటారు. ఇదేమీ ప్రజాయోగము కాదు. మనం పురుషార్థం చేసి తండ్రి నుండి సూర్యవంశీ రాజ్యాన్ని తీసుకుంటాము. పిల్లలను రోజూ అడగాలి, ఏ పొరపాట్లు చేయలేదు కదా? ఎవరికీ దుఃఖమునైతే ఇవ్వలేదు కదా? డిస్సర్వీస్ అయితే చేయలేదు కదా? కొంచెం సేవకే అలసిపోకూడదు. మొత్తం రోజంతా ఏం చేసారు అని అడగాలి? అబద్ధం చెప్తే పడిపోతారు. శివబాబా వద్ద ఏమీ దాగి ఉండదు. ఎవరు చూస్తారులే అని భావించకండి. శివబాబాకైతే వెంటనే తెలిసిపోతుంది. అనవసరంగా స్వయాన్ని సర్వనాశనం చేసుకుంటారు. సత్యమే చెప్పాలి, అప్పుడే సత్యయుగములో నాట్యం చేస్తూ ఉంటారు. సత్యము ఉన్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటుంది… సంతోషములో చాలా హర్షితముఖులుగా ఉండాలి. చూడండి, స్త్రీ పురుషులు ఉన్నారు. ఒకరి సౌభాగ్యములో స్వర్గ రాజ్యం ఉండవచ్చు, ఇంకొకరి భాగ్యములో ఉండకపోవచ్చు కూడా. కొందరి సౌభాగ్యము ఎలా ఉంటుందంటే – ఇరువురు కంకణం కట్టుకుని, మేము జ్ఞాన చితిపై కూర్చొని కలిసి వెళ్తాము అని అంటారు.

పిల్లలైన మీకు తల్లి అయిన జగదంబ యొక్క జీవిత చరిత్ర తెలుసు, ఇంకెవరూ 84 జన్మలను నమ్మరు. వారికి చాలా భుజాలను చూపించారు. కావున మనుష్యులు భావిస్తారు, ఈమె దేవత, జనన-మరణ రహితులు అని. అరే, రూపమైతే మనిషిదే కదా. ఇన్ని భుజాలైతే ఉండవు. విష్ణువుకు కూడా ప్రవృత్తిని నిరూపించడానికి 4 భుజాలు చూపిస్తారు. ఇక్కడైతే రెండు భుజాలే ఉంటాయి. మనుష్యులు నారాయణునికి 4 భుజాలను, లక్ష్మికి రెండు భుజాలను చూపించారు. కొన్ని చోట్ల లక్ష్మికి 4 భుజాలను చూపించారు. నారాయణుడిని నల్లగా, లక్ష్మిని తెల్లగా తయారుచేసారు. కారణము ఏమీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు – దేవతలు ఎవరైతే తెల్లగా ఉండేవారో, వారు ద్వాపరములోకి వచ్చి ఎప్పుడైతే కామ చితిపై కూర్చుంటారో అప్పుడు ఆత్మ నల్లగా అవుతుంది. తర్వాత తండ్రి వచ్చి నల్లగా ఉన్నవారిని తెల్లగా తయారుచేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మధురమైన బాబాను మరియు మధురమైన సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ మాయాపురిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి.

2. సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. విజయ మాలలోకి వచ్చేందుకు అలసటలేనివారిగా అయి సేవ చేయాలి. శివబాబాతో సత్యంగా ఉండాలి. ఏ పొరపాట్లు చేయకూడదు. ఎవరికీ దుఃఖమునివ్వకూడదు.

వరదానము:-

‘ఒకటి’ అనే పాఠం ద్వారా నిరాకారుడిని, ఆకారుడిని సాకారములో అనుభవం చేసే వరదానీ మూర్త భవ

కేవలం ‘ఒకటి’ అనే పాఠాన్ని పక్కా చేసుకుని వరదాతను సంతుష్టపరిచినట్లయితే అమృతవేళ నుండి రాత్రి వరకు దినచర్య యొక్క ప్రతి కర్మలో వరదానాలతోనే పాలింపబడుతూ, నడుస్తూ, ఎగురుతూ ఉంటారు. ఆ ఒకటి అనే పాఠం ఏమిటంటే – ఒకే బలము ఒకే భరోసా, ఏక మతము, ఏకరసము, ఐక్యత మరియు ఏకాంతప్రియము…ఈ ‘‘ఒకటి’’ అన్న పదమే తండ్రికి ప్రియము. ఎవరైతే ఈ ఒకటి అనే పాఠాన్ని పక్కా చేసుకుంటారో వారికి ఎప్పుడూ శ్రమ అనుభవం అవ్వదు. ఇటువంటి వరదానీ ఆత్మకు విశేష వరదానం ప్రాప్తిస్తుంది, అందుకే వారు నిరాకారుడిని-ఆకారుడిని సాకారంలో ఉన్నట్లు అనుభవం చేస్తారు.

స్లోగన్:-

ఎవరికైనా దూరంగా ఉంటూ తమ అవస్థను తయారుచేసుకునేందుకు బదులుగా సర్వులకు ఆధారంగా అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top